వైద్యుణ్ని దేవుడన్నది అందుకే.. 800 ఎం.ఎల్ మూత్రాన్ని పీల్చాడు  - MicTv.in - Telugu News
mictv telugu

వైద్యుణ్ని దేవుడన్నది అందుకే.. 800 ఎం.ఎల్ మూత్రాన్ని పీల్చాడు 

November 29, 2019

‘వైద్యో నారాయణ హరి’ అని ఇందుకే అన్నారేమో. అంటే వైద్యుడు దేవుడితో సమానం అన్నమాట. నిజమే ప్రాణాపాయంలో ఉన్నవాళ్లకు చికిత్స చేసి వారి ప్రాణాలను కాపాడే వ్యక్తి దేవుడే కదా. ఈ వైద్యుడు చేసిన పనిని చూస్తే మీరు దేవుడికే దేవుడు అంటారు. విమానం గాల్లో ఎగురుతుండగా అకస్మాత్తుగా నొప్పితో బాధపడుతున్న ఓ రోగిని రక్షించేందుకు అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ డాక్టర్‌ ఏకంగా 800 మిల్లీ లీటర్ల రోగి మూత్రాన్ని నోటితో పీల్చి బయటకు తీశాడు. న్యూయార్క్‌ పోస్ట్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం.. 

చైనాలోని జువాంగ్‌జౌ నగరం నుంచి ఓ విమానం న్యూయార్క్‌కు బయలుదేరింది. ఆ విమానం మరో ఆరు గంటల్లో న్యూయార్క్ విమానాశ్రయంలో దిగుతుంది. ఇంతలో లోపల ఉన్న ఓ 70 ఏళ్ల రోగి పొత్తి కడుపులో నొప్పితో బాధపడ్డాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్‌ జాంగ్‌ హాంగ్‌ పేషెంట్‌ను పరీక్షించాడు. వెంటనే విమానాన్ని కిందికి దింపలేని పరిస్థితి. దీంతో వైద్యుడు అతని కుటుంబ సభ్యులను అడిగి జబ్బేంటో తెలుసుకున్నాడు. ఆయన ప్రొస్ట్రేట్‌ గ్రంధి వ్యాకోచంతో బాధపడుతున్నారని, తరచూ మూత్రాశయం నుంచి మూత్రాన్ని క్లియర్‌ చేయాలని బంధువులు తెలిపారు. వెంటనే డాక్టర్ రంగంలోకి దిగాడు. పేషెంట్‌ మూత్ర ద్వారానికి ఓ ప్లాస్టిక్‌ ట్యూబ్‌ పెట్టి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని బయటకు పీల్చాడు. పీల్చిన ఆ మూత్రాన్ని ఓ ఖాళీ వైన్‌ బాటిల్‌‌లో పోస్తూ మూత్రాశయాన్ని ఖాళీ చేశాడు. దీంతో పేషెంట్ బతికి బట్టకట్టాడు. డాక్టర్ చేస్తున్న అత్వసర చికిత్సను చూస్తున్న అక్కడున్నవారంతా నోర్లు వెళ్లబెట్టారు. అతను అలా చేయకుంటే పేషెంట్‌ కోమాలోకి వెళ్లి చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దేవుడిలా కాపాడిని సదరు వైద్యుడికి రోగి కుటుంబ సభ్యులే కాదు, నెటిజన్లు ధన్యవాదాలు చెబుతున్నారు.