సీనియర్ నటులు చలపతిరావు గారి హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు అగ్రహీరో నందమూరి బాలకృష్ణ. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. “చలపతిరావు గారు తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలని నిర్మించారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. మా కుటుంబంతో చలపతిరావు గారికి అవినాభావ సంబంధం వుంది. నాన్నగారితో కలసి అనేక చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. చలపతిరావు గారు మా కుటుంబ సభ్యుడు. చలపతిరావు గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని బాలకృష్ణ తెలిపారు.
సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం నిర్వహించనున్నారు. ఆయన కూతురు అమెరికాలో ఉంటుండంతో ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.