నందమూరి హీరో తారకరత్న పార్థివదేహాం హైదరాబాద్ చేరుకుంది. బెంగళూరు నుంచి మోకిలలోని స్వగృహానికి అంబులెన్స్‌లో తారకరత్న భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులంతా తారకరత్న నివాసానికి చేరుకుంటున్నారు. నేడు ఇంటివద్దే ప్రముఖుల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచుతారు. రేపు ఉ.7 గంటల నుంచి సా.4 గంటల వరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు. సోమవారం సాయంత్రి 5 గంటలకి మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
తారకరత్న మరణ వార్తతో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 39 ఏళ్ళకే గుండెపోటుతో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు ప్రముఖులు తారకరత్నపై మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
జనవరి 27న నారాలోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అతనిని వెంటనే టీడీపీ నేతలు కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగుళూరుకు తరలించారు. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న చికిత్స తీసుకుంటూ శనివారం రాత్రి మరణించారు. తారకరత్నను బతికించేందుకు వైద్యులు విశేష కృషి చేశారు. నిరంతరం మెరుగైన వైద్యాన్ని అందించారు. విదేశి వైద్యలు సైతం తారకరత్నకు చికిత్స అందించినా ప్రాణాలను కాపాడలేకపోయారు. తారకత్న హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి బాలయ్య దగ్గర ఉండి అన్ని విషయాలను చూసుకున్నారు.