డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన తెలుగు హీరో - MicTv.in - Telugu News
mictv telugu

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన తెలుగు హీరో

November 26, 2019

వీకెండ్ వచ్చిందంటే చాలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెద్ద ఎత్తున నమోదు అవుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు జరిమానాలు విధించినా మందుబాబుల్లో మార్పు మాత్రం రావడంలేదు. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా పోలీసుల ఆదేశాలను పట్టించుకోవడంలేదు. తాగి పట్టుబడిన వారిలో సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఉంటున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో ప్రిన్స్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. దీంతో అతనికి కూకట్‌పల్లి కోర్టు జరిమానా విధించి మందలించింది. 

ఈనెల 24న రాత్రి పోలీసులు కూకట్‌పల్లి సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో అటుగా హీరో ప్రిన్స్ రావడంతో అతన్ని పరీక్షించగా మద్యం తాగినట్టు తేలింది. అతని కారుని సీజ్ చేసిన పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ప్రిన్స్ తన లాయర్లతో కలిసి కోర్టుకు హాజరయ్యాడు. ఈ సమయంలో అతన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు  వుడీ ధ‌రించి తన మొహాన్ని క‌వ‌ర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మీడియా కెమెరాకు అతడు చిక్కాడు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రిన్స్‌కు జరిమానా విధించింది. సెలబ్రెటీలు కూడా ఇలా తప్పతాగి దొరకడం ఏంటని ధర్మాసనం మందలించింది. 

కాగా ప్రిన్స్ ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించాడు. నీకు నాకు డ్యాష్ డ్యాష్,బస్టాప్,నేను శైలజ,రొమాన్స్,మిస్టర్ చిత్రాల్లో నటించాడు. బిగ్‌బాస్ సీజన్ 1లో కూడా అతడు పాల్గొన్నాడు. ప్రస్తుతం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు.