లాక్‌డౌన్ ఎఫెక్ట్.. రాజశేఖర్, ప్రకాశ్‌రాజ్‌ల దాతృత్వం - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. రాజశేఖర్, ప్రకాశ్‌రాజ్‌ల దాతృత్వం

March 23, 2020

Rajasekhar

కరోనా వైరస్ మనుషులను వణికిస్తోంది. దాని పేరు వింటేనే ఎక్కడ లేని భయం పుట్టుకొస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇలాంటి విపత్కర సమయంలో పేదవారికి అండగా ఉండేందుకు పలువురు సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి హీరో రాజశేఖర్ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 

వైరస్ వ్యాప్తి కారణంగా పూర్తిగా సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. చాలా మంది కార్మికులు, కళాకారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీంతో పేద కళాకారుల కోసం రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ బాధ్యతగా సరకులు అందించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సినీ ఇండస్ట్రీలో రోజూ కష్టపడితే కానీ పూటగడవని కుటుంబాలు ఉన్నాయని, అటువంటి వారిని ఆదుకుంటామని తెలిపారు. అలాంటి వారికి పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయబోతున్నామన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న కళాకారులు ఉంటే 90108 10140 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు. 

మరోవైపు నటుడు  ప్రకాష్ రాజ్ కూడా  తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన ఉద్యోగులందరికీ జీతాలు ముందుగానే చెల్లించానని అన్నారు. తన ఇంట్లో, ఫార్మ్ హౌస్‌, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్‌లో పనిచేసే వారికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించినట్టు చెప్పారు. నగదు కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తనకు సాధ్యమైనంతగా సాయం చేశానని మిగితా వారు కూడా ఇలాగే ఆదుకొని పేదవారి జీవితాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.