హీరో రామ్ క్షమాపణ.. ఆ డైరెక్టర్ విషయంలో అలా జరిగిందని.. - MicTv.in - Telugu News
mictv telugu

హీరో రామ్ క్షమాపణ.. ఆ డైరెక్టర్ విషయంలో అలా జరిగిందని..

June 23, 2022

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తమిళ్ డైరెక్టర్ లింగుస్వామికి ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సారీ..లవ్ యూ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన జూలై 14న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టిన చిత్రం బృందం నిన్న ఈ సినిమాలోని ‘విజిల్‌.. విజిల్‌..’ అంటూ సాగే పాటను సోషల్‌ మీడియా వేదికగా స్టార్‌ హీరో సూర్య చేత రిలీజ్‌ చేయించారు.

ఇక ఈ పాట లాంచింగ్‌ వేడుకలో రామ్‌ మాట్లాడుతూ.. విజిల్‌ సాంగ్‌ తనకు బాగా నచ్చిందని చెప్పాడు. తమ చిత్రానికి ఇంతటి ఎనర్టిటిక్ మ్యూజిక్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్, సింగర్స్, ప్రొడ్యూసర్స్.. ఇతర చిత్రయూనిట్ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. అయితే రామ్ స్పీచ్ ఇస్తున్న సమయంలో డైరెక్టర్ లింగుస్వామి గురించి చెప్పడం మర్చిపోయారు. తన పొరపాటును సరిచేసుకుంటూ ట్విట్టర్ వేదికగా ఆయనకు క్షమాపణలు చెప్పారు రామ్. “ఈ సినిమా తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్, డైరెక్టర్ లింగుస్వామి… ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్ ను మీరు మీ భుజాలపై ఎత్తుకున్నారు. ఇప్పటివరకు నేను చేసిన ఉత్తమ దర్శకులలో మీరు ఒకరిగా ఉన్నందుకు ధన్యవాదాలు.. సారీ అండ్ లవ్ యూ “ అంటూ రాసుకొచ్చారు.

ఇక రామ్ చేసిన ట్వీట్ పై డైరెక్టర్ లింగుస్వామి స్పందించారు. “నాతో కలిసి పనిచేయడానికి నువ్వు ఎంతగా ఇష్టపడ్డావో నాకు తెలుసు. సినిమా చూసిన తర్వాత ఆత్మీయంగా నువ్వు నన్ను ఆలింగనం చేసుకున్నావ్. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మనం మరింత దూరం ప్రయాణించాలనుకుంటున్నాను” అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.