Hero Ravi Teja’s Brother' son Madhav Debut Film Announced
mictv telugu

రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వస్తున్నాడు

August 9, 2022

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి ఓ యంగ్ హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. రవితేజ తమ్ముడైన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా రాబోతున్నాడు. ఈ రోజు అతని తొలి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్న ఆ చిత్రానికి ‘ఏయ్… పిల్లా’ టైటిల్ ఖరారు చేశారు.

ఈ రోజు నల్లమలుపు శ్రీనివాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ… సినిమా టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ కథానాయిక. హీరోతో పాటు ఆమెకూ ఇది తొలి చిత్రమే. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునే విధంగా, 90వ దశకం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ తెలిపారు. కాగా హీరోగా ఎంట్రీ ఇస్తున్న మాధవ్ భూపతిరాజు తండ్రి రఘు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆర్టిస్టుగా చేశారు. మొత్తానికి రవితేజ కుమారుడు మహాధన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే.. ఆయన తమ్ముడు కొడుకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.