మాదక ద్రవ్యాల కేసులో భాగంగా సిట్ విచారణకు ఇవాళ హీరో రవితేజ హాజరయ్యారు. డ్రగ్స్ వ్యవహారంలో తెలుగు సినిమా రంగానికి సంబంధించి 12 మంది ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 8 మందిని విచారించిన సిట్ 9 వ వ్యక్తిగా మాస్ మహారాజా రవితేజను ఆబ్కారీ ఆఫీసుకు రప్పించింది. కెల్విన్ కాల్ డేటాలో రవితేజ నంబరు వుండటంతో అతనికి నోటీసులు జారీ చేసారు.
విదేశాల్లో సినిమా షూటింగులో వున్న తను కోర్టు నోటీసులు అందిన విషయం తెలుసుకొని హైదరాబాదుకు వచ్చాడు. సిట్ కార్యాలయానికి వచ్చిన రవితేజ ముఖంలో ఎలాంటి ఆందోళన కన్పించకపోవడం గమనార్హం. ఇవాళ 10 గంటలకు సిట్ కార్యాలయానికి హాజరైన రవితేజ సాయంత్రం వరకు విచారణలో పాల్గొంటాడు. సిట్ అధికారులు తమదైన పంథాలో విచారించనున్నారు. అందరిలానే రవితేజ గోళ్ళు, తల వెంట్రుకలు, రక్త నమూనాలను కూడా సేకరిం చనున్నారు.