తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. వరం, బ్యాచిలర్స్ చిత్రాలలో హీరోగా నటించిన సత్య శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. కరోనా సమయంలో భార్యను, తల్లిని పోగొట్టుకున్న సత్య.. ఆ తర్వాత తీవ్ర మానసిక కుంగుబాటుకు లోనయ్యాడు. దాంతో ఈ రోజు సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
కాగా, మొదట్లో హీరో స్నేహితుడిగా చిన్న పాత్రలు పోషించిన సత్య తర్వాత హీరోగా రెండు సినిమాలు చేశాడు. అవి ఆశించినంతగా ఆడకపోవడంతో బిజినెస్ మీద దృష్టి మళ్లించాడు. ఈయన నటించిన వరం సినిమాలోని నచ్చినావే నవ్వుల గోపెమ్మా.. కంటినిండా నువ్వే కదమ్మా అనే పాట ఇప్పటికీ చాలా మంది సంగీత ప్రియులు వింటూ ఉంటారు. సత్యకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. సత్య అకాల మరణం పట్ల శ్రేయోభిలాషులు, బంధువులు విచారం వ్యక్తం చేశారు.