వేదికపైనే చెంపదెబ్బ కొట్టిన హీరో.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

వేదికపైనే చెంపదెబ్బ కొట్టిన హీరో.. వీడియో వైరల్

March 28, 2022

 

006

ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్స్ వేడుకలు లాస్ ఏంజెలెస్‌లోని ఐకానిక్ డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకలు ఓవైపు అట్టహాసంగా జరుగుతుంటే, మరోవైపు ఓ హాలీవుడ్ హీరో వేదికపైనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి చెంపను చెల్లుమనిపించిన సంఘటన అక్కడున్న వారిని షాక్‌కు గురి చేసింది. ఆ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హాలీవుడ్‌ హీరో విల్‌స్మిత్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నటుడు క్రిస్‌ రాక్‌ను వేదిక మీదికి వచ్చి చెంపదెబ్బ కొట్టి వెళ్లాడు. అందుకు ప్రధాన కారణం.. విల్‌‌స్మిత్‌ భార్య జాడా పింకెట్ స్మిత్‌పై క్రిస్‌ రాక్‌ జోకులు వేశాడు. దీంతో కోపగించుకున్న విల్‌‌స్మిత్‌ స్టేజ్‌ పైకి వచ్చి క్రిస్‌రాక్‌ చెంపపై కొట్టాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు.

 

అయితే, విల్‌స్మిత్ కొట్టిన ఈ చెంపదెబ్బని క్రిస్‌రాక్‌ చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నాడు.స్మిత్‌ మాత్రం ఆగ్రహంతో ఊగిపోతూ, ‘నా భార్య పేరు నీ నోటి నుంచి రానివ్వకు’ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో కొందరు ఇదంతా స్టంట్ కోసమే చేశారంటూ సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. విల్‌స్మిత్‌ సినిమా ప్రమోషన్స్‌ చేసుకుంటున్నాడని కొట్టిపారేస్తున్నారు. మరోవైపు క్రిస్‌రాక్‌ పోలీసులను ఆశ్రయిస్తాడని అంతా అనుకున్నారు. కానీ కంప్లైంట్‌ ఇవ్వడానికి క్రిస్‌ రాక్‌ నిరాకరించినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. అనంతరం స్మిత్ కింగ్ రిచర్డ్‌లో తన నటనకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు.