హీరో స్ల్పెండర్ బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ధర అందుబాటులో ఉండడం.. మైలేజ్ కూడా అధికంగా రావడంతో స్ల్పెండర్ బైక్‌లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. అందుకు తగినట్టుగానే హీరో మోటోకార్ప్ సంస్థ కొత్త మోడల్స్‌ను ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకొస్తోంది. తాజాగా మరో సూపర్ బైక్‌ను తెచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన సూపర్ స్ల్పెండర్ XTEC 125 సీసీ బైక్‌ను విడుదల చేసింది.
ఇప్పటివరకు హీరో XTEC 100సీసీ బైక్‌లు మాత్రమే అందబాటులో ఉండేవి. ఇప్పడు 125 సీసీ బైక్స్‌ను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా దీనికి కొత్త హంగులను జోడించారు. గ్లాస్ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మెట్టే యాక్సిస్ గ్రే రంగుల్లో.. డ్రమ్, డిస్క్ రెండు వేరియంట్లలో లభించనుంది. ఇందులో పూర్తిగా డిజిటల్ స్పీడోమీటర్, తక్కువ ఇంధన హెచ్చరిక, సర్వీస్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.సూపర్ స్ల్పెండర్ XTECకు పగటి పూట వెలిగే LED హెడ్ ల్యాంప్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో సూపర్ స్ల్పెండర్కు ఉపయోగించిన 124.7 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్నే వాడారు. పెట్రోల్ ట్యాంక్‌పై కొద్దిగా గ్రాఫిక్ మార్పులను మాత్రమే చేశారు. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సూపర్ స్ల్పెండర్ దాదాపుగా 68 కిలోమీటర్ల మైలేజిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మార్కెట్లో దీని ధరను చూస్తే బ్రేక్ వేరియంట్ ధర రూ. 83,368 వేలు కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 87,268గా ఉంది.