Hero Vijay Deverakonda almost cried when he saw Akdi Pakdi song choreography
mictv telugu

ఆ కొరియోగ్రఫీ చూసి ఏడ్చేశా.. విజయ్ దేవరకొండ

July 12, 2022

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ చేస్తూనే ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో అప్ డేట్ సినిమాపై హైప్ పెంచేస్తోంది. విజయ్ దేవరకొండ- పూరి కాంబో కావడంతో ప్రతి ఒక్కరి చూపు ఈ సినిమాపైనే ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘అక్డి పక్డి’ పాట టీజర్ విడుదలైంది. ఇది పక్కా పూరి జగన్నాథ్ స్టైల్‌లో తెరకెక్కిన మాస్ నెంబర్. విజయ్ దేవర కొండ ఇప్పటి వరకూ సక్సెస్ సాధించినా అతని సినిమాల్లో ఈ తరహా మాస్ పాటలేవీ లేవు. పలు జబర్దస్త్ హిట్ సాంగ్స్ ఉన్నా ఈ తరహాలో చిందేసే మాస్ నెంబర్స్ లేవనే చెప్పాలి. మాస్ హీరో ఇమేజ్ కావాలంటే ఇలాంటి నెంబర్స్ ఉండాల్సిందే.

అయితే డ్యాన్స్‌లో విజయ్ దేవరకొండ కాస్త వీక్ అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ విషయాన్ని గతంలో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. కానీ లైగర్ కోసం మాత్రం విజయ్ బాగానే కష్టపడ్డట్టు కనిపిస్తోంది. ఈ అక్డీ పక్డీ సాంగ్‌లో కాలు కదిపాడు. తన స్టైల్లో స్టెప్పులు వేసుకుంటూ వెళ్లాడు. కాళ్లు చేతులు బాగానే ఆడించాడు. ఈ సాంగ్ కొరియోగ్రఫీ, షూటింగ్ గురించి చెబుతూ ఓ పోస్ట్ వేశాడు విజయ్ దేవరకొండ. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చూసినప్పుడు నేను ఏడ్చేశాను..కానీ షూటింగ్‌లో మాత్రం బ్లాస్ట్ చేసేశా అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి విజయ్ మాత్రం తన డ్యాన్సులతో అందరినీ ఫిదా చేసేస్తున్నాడు. ఇక ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.