హీరో విజయ్ అభిమానుల ఆలోచన అదుర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

హీరో విజయ్ అభిమానుల ఆలోచన అదుర్స్

October 23, 2019

Hero Vijay's  .

అభిమాన హీరో సినిమా విడుదలకు సిద్ధమైందంటే చాలు ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. ఎక్కడ చూసినా ప్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులతో నింపేస్తారు. ఇటువంటివి ఏర్పాటు చేయడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. చెన్నైలో తాజాగా రోడ్డుపై ఏర్పాటు చేసిన బ్యానర్ కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ యువతి మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సెలబ్రెటీలు ఇకపై తమ కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని వారి అభిమానులకు పిలుపునిచ్చారు. తమిళ హీరో విజయ్ అభిమానులు ఆ పిలుపుతో సరికొత్త ఆలోచన చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. 

విజయ్‌ ద్విపాత్రాభినయంలో నటించిన ‘బిగిల్‌’ సినిమా విడుదల సందర్భంగా ఓ మంచి కార్యక్రమాన్ని ఆయన అభిమానులు నిర్వహించారు. సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసే బ్యానర్లకు అయ్యే ఖర్చు మొత్తాన్ని వెచ్చించి మీనాక్షిపురం బాలికల ఉన్నత పాఠశాల పరిసరాల్లో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. దీనికి పోలీసు అధికారి అర్జున్ సరవనన్ కూడా హాజరయ్యారు. విజయ్ అభిమానులు చేసిన మంచి పనిని అభినందించారు.

కాగా అట్లీ – విజయ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగిల్ సినిమా ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విజయ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన నయనతార నటిస్తోంది. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణంలో ఈసినిమా రాబోతోంది. తెలుగులో ఈ సినిమాని విజిల్ పేరుతో విడుదల చేయనున్నారు.