హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. అస్సాంలో రూ. 25 కోట్ల సరుకు  - MicTv.in - Telugu News
mictv telugu

 హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. అస్సాంలో రూ. 25 కోట్ల సరుకు 

September 28, 2020

Heroin Worth ₹ 25 Crore Seized In Assam, 1 Arrested: Police

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ సరఫరాకు పాల్పడ్డ ముఠాను ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 155 గ్రాముల నిషేధిత హషీస్ ఆయిల్‌ను కలిగి ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్టు అయిన వ్యక్తులు డ్రగ్స్‌కు బానిస అయినట్లు వెల్లడించారు. వారంతా ప్రతిరోజూ గంజాయితో పాటు హషీస్ ఆయిల్‌ను సేవిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఈ హషీస్ ఆయిల్‌ను బోయిన్‌పల్లి, మల్కాజ్‌గిరి ఏరియాల్లో తమకు తెలిసిన వ్యక్తులకు విక్రయిస్తున్నారని వివరించారు. మరింత లోతుగా విచారించిన పోలీసులు వారినుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. సాయి రెడ్డి, విక్రమ్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ ఐదుగురు హషీస్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నారని అన్నారు. అయితే అరకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి 5 గ్రాముల హషీస్ ఆయిల్‌ను రూ.1500 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.

ఇదిలావుండగా అసోంలో డ్రగ్ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కబ్రి అంగ్లాంగ్ జిల్లాలో రూ.25 కోట్ల విలువైన 5 కేజీల హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయమై కబ్రి అగ్లాంగ్ డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా మాట్లాడుతూ.. ‘అసోం-నాగాలాండ్ సరిహద్దుల్లో రూ.25 కోట్ల విలువైన 5 కేజీల హెరాయిన్‌ను తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. డ్రగ్స్ స్మగ్లర్లకు ఇది భారీ ఎదురుదెబ్బ’ అని డీజీపీ తెలిపారు. కాగా, పట్టుబడిన నిందితుడిని ఇస్మాయిల్ అలీగా గుర్తించారు.