అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకు నాయనమ్మగా నటించిన.. అలనాటి నటి కాంచన ఒకప్పుడు ఎయిర్ హోస్టెస్ అన్న విషయం అతి కొద్దిమందికే తెలుసు. దక్షిణాది సినిమా రంగంలో గొప్ప గొప్ప నటీమణులు ఏలుతున్న సమయంలో సువర్ణ సుందరి సినిమాలో నాగ కన్య పాత్రలో నటించి వెండి తెరపై అడుగు పెట్టారు కాంచన. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న సమయంలో 1970లో దర్శకుడు శ్రీధర్ ‘ప్రేమించి చూడు’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. వీరాభిమన్యు, కల్యాణ మండపం వంటి సినిమాలు హీరోయిన్ గా కాంచన కెరీర్ కు బంగారు బాట వేశాయి.
1950 ల కాలంలోనే ఎయిర్ హోస్టెస్ గా జాబ్ చేస్తూ .. ఆ వైపు నుంచి సినిమాల దిశగా ఆమె అడుగులు వేశారు. 1957 లో వచ్చిన సువర్ణ సుందరి సినిమాలో తొలిసారిగా నటించారు. ఆ తర్వాత ఆనాటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండేదానిని. కుటుంబం ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందుల్లో ఉందన్న విషయం అర్థం కావడానికి నాకు కొంత సమయం పట్టింది. అందుకోసమే ఎయిర్ హోస్టెస్ గా జాబ్ చేశాను. అప్పట్లో నెలకి 600 జీతం ఇచ్చేవారు. అదే చాలా ఎక్కువగా అనిపించేది. ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు. ఎయిర్ హోస్టెస్ పనిచేశానన్న విషయం చాలా కొద్దిమందికి తెలుసు” అని ఆమె అన్నారు.
“సినిమా హీరోయిన్ కావడం, ఆ తర్వాత ఆస్తి కూడా ఎక్కువ ఉండడంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా పెద్ద పెద్ద వారు ముందుకు వచ్చారు. కానీ మా అమ్మ పిన్నికొడుకు ఒకడు ఉండేవాడు .. వాడు ఎందుకూ పనికిరాడు. అమ్మానాన్నలు అతను చెప్పినట్టు ఆడేవారు. నా ఆస్తులు నాకు కాకుండా పోవడానికి అతనే కారకుడు. కోర్టు ద్వారా పోరాడటానికి జీవితమంతా సరిపోయింది” అంటూ చెప్పుకొచ్చారు.