శ్రమ, సాధన, నైపుణ్యం, అదృష్టం కాదు మ్యాడ్ నెస్ సక్సెస్ కి తారకమంత్రం అని మోడర్న్ థియరీస్ చెప్తుంటాయి. దీనికి సజీవ సాక్షం ఎస్ఎస్ రాజమౌళి. సినిమానే శ్వాసగా సాగిపోతున్న దర్శకధీరుడు. అపజయమన్నది ఎరుగని విజేత. తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తం చేసిన మగధీరుడు. ఈ ఘనతలు సాధించడానికి కష్టపడటం, అదృష్టం కలిసిరావడం వంటి పాత సామెతలకు అతీతుడు రాజమౌళి. కేవలం ఒక పిచ్చితనంతో వరుసగా బ్లాక్ బస్టర్స్ కొడుతూ వెళ్తున్నాడు. రాజమౌళి ఒక పసి పాపని దత్తత తీసుకున్నప్పుడు మొదలైన బాహుబలి చిత్రం.. ఆ పాప పెరిగి పెద్దదై బాహుబలి షూటింగ్ లొకేషన్ రామోజీ ఫిలిం సిటీ నుండే స్కూల్ కి వెళ్లిందట. అంటే ఒకే కథపై అన్ని సంవత్సరాలు సమయం ఇవ్వటం అనేది ఋషి తపస్సు కంటే గొప్పది.
ఇదంతా రాజమౌళికి సినిమా అంటే ఉండే పిచ్చి ప్రేమే కారణం. ఈ సినిమా పిచ్చితో పిల్లలు, కుటుంబం లాంటివన్నీ త్యాగం చేసిన రాజమౌళి తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకునే వాడు కాదట. తాజాగా ఈ విషయాన్నీ నటి శ్రియా మీడియాతో పంచుకుంది. షూటింగ్ అంటే రాజమౌళికి ఉండే కమిట్మెంట్ చూసి షాక్ అయ్యానని.. తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా షాట్ కోసం రాజమౌళి కష్టపడతాడని చెప్పింది. ‘‘ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ టైమ్లో రాజమౌళి ఆస్తమాతో ఇబ్బంది పడుతూ కనిపించారు. అజయ్ దేవగణ్, నా కాంబినేషన్లో వచ్చే సీన్లు షూటింగ్ సమయంలో దుమ్ము కారణంగా చాలా అసౌకర్యంగా కనిపించారు. అయినప్పటికీ కథని బాగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో రాజమౌళి ఆ ఇబ్బందిని లెక్క చేయలేదు. సీన్ బాగా వచ్చేందుకు రాజమౌళి ఎంతైనా కష్టపడతారు’’ అని శ్రియ చెప్పుకొచ్చింది. ఇక రాజమౌళి తన నెక్ట్స్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోతున్నాడు. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.