తెలుగు రాష్ట్రాలపై హికా తుపాను ఎఫెక్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు రాష్ట్రాలపై హికా తుపాను ఎఫెక్ట్

September 26, 2019

తెలుగు రాష్ట్రాలపైకి ‘హికా’ తుపాను దూసుకొస్తోంది.  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలం అవుతుండగా ‘హికా’ తుపాను పొంచి ఉందనే హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. 

Tufan Effect.

తుపాను తీరం దాటే సమయంలో వేగంగా గాలులు వీస్తాయని చెబుతున్నారు. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని మత్సకారులకు సూచిస్తున్నారు. హికా తుపాను ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ,ఉత్తరప్రదేశ్, విదర్భ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. హైదరాబాద్ రోడ్లన్ని చిత్తడిగా మారాయి. హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. పలు జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారిపోయాయి.