High Alert : రాష్ట్రపతి భవన్‎తోపాటు దేశంలోని పలు ఎయిర్‎పోర్టులలో హై అలర్ట్.. డ్రోన్‌లతో పేల్చివేస్తామని బెదిరింపులు..!! - Telugu News - Mic tv
mictv telugu

High Alert : రాష్ట్రపతి భవన్‎తోపాటు దేశంలోని పలు ఎయిర్‎పోర్టులలో హై అలర్ట్.. డ్రోన్‌లతో పేల్చివేస్తామని బెదిరింపులు..!!

March 3, 2023

హోలి సందర్భంగా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈనేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. తాజాగా హోలీ సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రధాని, రాష్ట్రపతి భవన్‌తో సహా దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలను డ్రోన్లతో పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ పోర్టు డైరెక్టర్ పేరుతో పోస్టు ద్వారా వచ్చిన బెదిరింపు లేఖను సీరియస్ గా తీసుకున్న వారణాసి ఎయిర్ పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శక్తి త్రిపాఠి బుధవారం ఫూల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. లేఖ అందిన తర్వాత ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ ఏజెన్సీల అత్యవసర సమావేశం జరిగింది.

 

సీఐఎస్‌ఎఫ్ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆపరేషనల్ ఏరియాలోని వాచ్ టవర్ వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. డ్రోన్ల ద్వారా రసాయనాలు చల్లి విమానాశ్రయాన్ని నేలమట్టం చేస్తామని లేఖలో పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఆర్యమ సన్యాల్‌కు పంపిన లేఖలో, హోలీ రోజున విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని డ్రోన్ దాడి చేస్తామంటూ హెచ్చరించారు.

వారణాసితోపాటు దేశంలో ప్రముఖ ఎయిర్ పోర్టులలో కూడా నిఘా కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచిఉందని ఇప్పటికే ఏఎన్ఐ కూడా అలర్ట్ చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో భద్రతను మరింత పెంచారు.