రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మూసి నది ఉప్పొంగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. పోలీసు శాఖ చేపడుతున్న సహాయక చర్యలను కొనసాగించాలన్నారు. ఈరోజు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షకు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమీక్షని నిర్వహించారు. పోలీసు సిబ్బంది అనుక్షణం అందుబాటులో ఉండి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.