కృష్ణాలో హై అలర్ట్.. తిరుపతిలో మాంసం బంద్.. - MicTv.in - Telugu News
mictv telugu

కృష్ణాలో హై అలర్ట్.. తిరుపతిలో మాంసం బంద్..

April 5, 2020

High alert in Krishna .. Meat ban in Tirupati

శనివారం ఏకంగా మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ కేసులు తేలడంతో ఏపీలో కలకలం రేగింది. దీంతో కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 32కు చేరుకోవడంతో జిల్లాలో విజయవాడ, కానూరు, నందిగామ, జగ్గయ్యపేట, మచిలీపట్నం పట్టణాల్లోని కరోనా బాధితుల ఇంటి పరిసర ప్రాంతాల్లో యాంటీ వైరస్‌ రసాయనాలను పిచికారీ చేయించారు. 

అనుమానం ఉన్న వారిని ఐసోలేషన్‌ కేంద్రానికి తీసుకెళ్లి ముందస్తు పరీక్షలు నిర్వహించేలా చూస్తున్నారు. విజయవాడ నగరంలో వ్యాధి నివారణ దిశగా ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తున్నారు. వ్యాపారులు, ఇతర దుకాణాలు పక్కా సమయపాలన పాటించేలా, లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు పరుస్తున్నారు.

ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరోవైపు పారిస్‌ నుంచి వచ్చిన విజయవాడ పాతబస్తీ చేపల మార్కెట్‌ ప్రాంతానికి చెందిన యువకుడు ప్రభుత్వ ఆసుపత్రిలో 14 రోజులపాటు చికిత్స పొంది కోలుకున్నాడు. రెండుసార్లు అతనికి కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. దీంతో అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారని అధికారులు వెల్లడించారు. సదరు యువకుడిని కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్‌ అభినందించారు. ఇదిలావుండగా, తిరుపతిలో ఆదివారం చికెన్, మటన్ దుకాణాలను మూసివేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. 11 డివిజన్‌లలో రెడ్ జోన్లు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం ఒక్కరోజు చికెన్, మటన్ దుకాణాలు బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలను సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.