మరి ఆరుషిని చంపిందెవరు?

తొమ్మిదేళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు ఆమె తల్లిదండ్రులను గురువారం నిర్దోషులుగా ప్రకటించింది. వారు హత్య చేశారనడానికి పక్కా సాక్ష్యాలు లేవని, సీబీఐ కూడా గట్టి ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొంది.  వారిద్దరికీ బెయిల్ కూడా మంజూరు చేసింది. నోయిడాకు చెందిన 14 ఏళ్ల ఆరుషిని ఆమె తల్లిదండ్రులు నూపుర్, రాజేశ్ తల్వార్ చంపారని అభియోగాలు ఉన్నాయి. నేపాల్‌కు చెందిన తమింటి పనిమనిషి హేమ్ రాజ్‌ను కూడా వారు గొంతు కోసి చంపారని సీబీఐ పేర్కొంది. 2008 మే 14న ఆరుషి.. తన తల్లిదండ్రుల గదిలో హత్యకు గురైంది. ఆమెను హేమ్ రాజ్ చంపి ఉంటారని తొలుత అనుమానించారు. అయితే మరుసటి రోజు హేమ్ రాజ్ వారింటి డాబాపై విగతజీవిగా కనిపించాడు. ఆరుషి, హేమ్ రాజ్‌లను సన్నిహితంగా చూసిన ఈ దంతవైద్య దంపతులు పరువు కోసం హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యలకు శస్త్రచికిత్సలకు వాడే కత్తులను వాడడంతో  నూపుర్, రాజేశ్లే ఈ ఘాతుకాలకు పాల్పడి ఉంటారని భావించారు. కేసును విచారించిన సీబీఐ కోర్టు వీరికి 2013లో జీవిత ఖైదు విధించింది. అయితే తాము అమాయకులమని వీరు వాదించారు.

ఈ కేసులో మీడియా, రాజకీయ నాయకులు పలువురు పోలీసులు పెద్దలు కూడా జోక్యం చేసుకున్నారు. రాజేశ్ సాక్ష్యాలను నాశనం చేశారని సీబీఐ కూడా ఆరోపించింది. అయినా గట్టి సాక్ష్యాలు లేవంటూ హైకోర్టు రాజేశ్ దంపతులను నిర్దోషులుగా విడుదల చేసింది. మరైతే, ఆరుషిని. హేమ్ రాజ్ను ఎవరు చంపినట్టు? ఒకవేళ హేమ్ రాజ్ చంపి ఉంటాడనుకేంటే.. అతడు హత్య తర్వాత పారిపోయి ఉండాలి. కానీ అతడు కూడా హత్యకు గురయ్యాడు. రాజేశ్ సహాయకుడు, ఇద్దరు కాంపౌడర్లు కూడా ఈ హత్యకేసులో విచారణ ఎందుర్కొన్నారు. అయితే వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు దొరకలేదు. వారికి ఆరుషిని, హేమ్ రాజ్‌లను హత్య చేయాల్సిన అవసరం లేదు. రాజేశ్ పురమాయించి ఉంటేనే వారు ఆ నేరానికి పాల్పడి ఉండే అవకాశముంది. ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేసిన సాక్ష్యాలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయారు.

SHARE