ఫాం హౌస్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దర్యాప్తుపై స్టే విధించాలన్న రోహిత్‌రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.. అప్పటికి రోహిత్ రెడ్డి పిటిషన్ పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ ని ఆదేశించింది. అయితే.. 30వ తేదీన రోహిత్ రెడ్డి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చామని.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణకు హాజరు కావలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ఈడీ, రోహిత్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరుకాలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపినట్లు ఈడీ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాది తన క్లయింట్ రెండుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారని న్యాయమూర్తికి తెలిపారు. ఈడీ అడిగిన వివరాలన్నింటినీ సమన్లలో సమర్పించినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా పడింది.