‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ విడుదలకు హైకోర్టు బ్రేక్  - MicTv.in - Telugu News
mictv telugu

‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ విడుదలకు హైకోర్టు బ్రేక్ 

December 11, 2019

amma rajyamlo kadapa biddalu.

దర్శకుడు రాంగోపాల్ వర్మ్ నిర్మించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం ఇప్పట్లో విడుదలయ్యేలా కనిపించడం లేదు. షెడ్యూలు ప్రకారం రేపు(ఈ నెల 12న) విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారిచేసింది. ఈ చిత్రంలో వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని, ఇది ప్రదర్శనకు అనర్హమని ప్రిలిమినరీ కమిటీ నివేదికతో కోర్టు అంగీకరించింది. 

దీంతో, సినిమా విడుదలను ఆపేసి, కమిటీ వెలిబుచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలని రివైజ్ కమిటీకి హైకోర్టు సూచించింది. రివైజింగ్ కమిటీ సిఫార్సుల ప్రకారం సినిమాలో మార్పులు చేశాకనే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా, తాము అభ్యంతరకర సన్నివేశాలను తొలగించామని చిత్రబృందం కోర్టుకు వివరించింది. ఈ వాదనను కోర్టు తప్పబట్టింది. ‘ఎక్కడ తీసేశారు? కేవలం డైలాగును మాత్రమే మ్యూట్ చేశారు. ఆ పనొక్కటి చేస్తే సరిపోతుందా..’ అని ప్రశ్నించింది. 

కాగా, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వాలని చిత్రబృందం సెన్సార్‌బోర్డు వద్ద ఆందోళన నిర్వహించింది.  బోర్డు సూచించిన కత్తిరింపులు చేసినా సర్టిఫికెట్ ఇవ్వకపోవడం సరికాదని నిర్మాత నట్టికుమార్ విమర్శించారు. టీడీపీ పార్టీ నాయకులు రూ. 50 లక్షలు ఖర్చు పెట్టి విడుదలను అడ్డుకుంటున్నారని, సుజనా చౌదరి హస్తం కూడా ఉందని ఆరోపించారు. సెన్సార్‌ బోర్డు ప్రాంతీయ అధికారి రాజశేఖర్ రూ. 50 లక్షల లంచం అడిగారని, ఆయనపై  పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.