అడ్డూ అదుపు లేకుండా సలహాదారులను నియమించుకుంటున్న ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, తహసీల్దార్ లకు కూడా సలహాదారులను నియమిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు సలహాదారుల నియామకం రాజ్యాంగబద్ధమో కాదో తేలుస్తామని, ప్రభుత్వ అధికారులకు ఏయే అధికారాలు ఉన్నాయో కూడా తేలుస్తామని స్పష్టం చేసింది. విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి సలహాతోనే దేవాదాయ శాఖకు జ్వాలాపురపు శ్రీకాంత్ ని సలహాదారుగా నియమించామని అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. దీంతో మండిపడిన కోర్టు.. పీఠాధిపతులు దేవాలయాలకే పరిమితం కావాలని, వారు ప్రభుత్వాలను నడపలేరని చెప్పింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్ధం చేసుకోగలం కానీ ప్రభుత్వ శాఖలను సలహాదారులేంటని ప్రశ్నించింది. వీరికి నిధులు బడ్జెట్లో ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారని నిలదీసింది. అనంతరం ఈ నెల 19కి విచారణను వాయిదా వేస్తూ సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.