రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. రామంచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.3 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీ ఇవ్వాలని నిందితులకు కోర్టు సూచించింది. ప్రతి సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దాంతో పాటు ముగ్గురు నిందితులు తమ పాసు పోర్టులను పోలీసు స్టేషన్లో సరెండర్ చేయాలని స్పష్టం చేసింది.
ఇక ఈ కేసులో బుధవారం ప్రభుత్వం తరపున వాదించిన సుప్రీం సీనియర్ లాయర్ దుష్యంత్ దవే.. ఈ కేసు తీవ్ర నేరమైన కేసని అన్నారు. బీజేపీకి సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలన్నారు. బీజేపీకి సంబంధం లేదంటూనే నిందితుల తరుపున పిటిషన్ వేస్తారని, దేశంలో అనేక ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి విమానాల్లో తీసుకెళ్లి ప్రభుత్వాలు పడగొట్టారని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదైనప్పటి నుంచి బీజేపీ.. కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కేంద్రం కుట్ర అన్నారు.