‘చక్ర’లో ఇరుక్కున్న విశాల్.. హైకోర్టు నోటీస్ - MicTv.in - Telugu News
mictv telugu

‘చక్ర’లో ఇరుక్కున్న విశాల్.. హైకోర్టు నోటీస్

September 22, 2020

High court notice to actor vishal

నటుడు విశాల్‌ కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. అతడు నటించిన‌ తాజా చిత్రం ‘చక్ర’కు ఎంఎస్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మించాడు. ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇంకా థియేటర్లు ఓపెన్ కాలేదు. దీంతో ఓటీటీలో విడుదల చేయాలని విశాల్‌ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ అనే మరో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విశాల్, ఎంఎస్ ఆనందన్ లకు నోటీసులను జారీ చేసింది. దానికి కారణం విశాల్ గతంలో నటించిన ‘యాక్షన్’ సినిమా కారణం.

విశాల్.. సుందర్‌ సి డైరెక్షన్‌లో ‘యాక్షన్’ అనే సినిమాలో నటించాడు‌. ఈ సినిమాను రూ. 44 కోట్ల భారీ వ్యయంతో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ నిర్మించింది. ఈ సినిమా విడుదల సమయంలో రూ.20 కోట్ల వరకు విశాల్‌ గ్యారెంట్‌ ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ‌ సినిమా కేవలం రూ. 11.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ నష్టాలను భరించడానికి విశాల్‌ తన తదుపరి చిత్రాన్ని ఆనంద్‌ డైరెక్షన్‌లో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో చేస్తానని చెప్పాడట. కానీ, సినిమా విశాల్ తన సొంత బ్యానర్‌లో చేసుకున్నాడు. అలాగే ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నాడని, విశాల్‌ తమకు రూ.8.29 కోట్లు బాకీ ఉన్నాడని, అది ఇచ్చే వరకు విశాల్‌ ‘చక్ర’ సినిమా విడుదలను ఆపాలంటూ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్ అధినేతలు మద్రాస్ కోర్టును ఆశ్రయించారు.