కోట్ల కోట్ల అప్పులు ఎగ్గొటిన వాళ్లు దర్జాగా దేశాలు దాటిపోతుంటే గుడ్లప్పగించి చూస్తున్న బ్యాంకులు సామాన్యుల విషయంలో మాత్రం ప్రతాపం చూపిస్తుంది. కేవలం 31 పైసల రుణం చెల్లించలేదని ఓ రైతును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇబ్బంది పెట్టింది. ఆ ‘డబ్బు’ కడితేనే నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తామని పేచీ పెట్టింది. తిక్క రేగిన రైతు కోర్టుకెళ్లాడు.
గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లా ఖోరజ్ గ్రామానికొ చెందిన శ్యామ్ జీ అనే రైతు 2003లో తన స్థలాన్ని ఇద్దరికి అమ్మాడు. తర్వాత ఆ భూమిపై తీసుకున్న రూ. 3 లక్షల పంట రుణం చెల్లించాడు. బ్యాంక్ నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో భూమి రిజిస్ట్రేషన్ కాలేదు. బ్యాంకు స్పందించకపోవడంతో శ్యామ్ కోర్టుకు వెళ్లాడు. కేసును విచారించిన కోర్టు బ్యాంకుపై మండిపడింది. 50 పైసల కంటే తక్కువ మొత్తాన్ని లెక్క తీసుకోవద్దని బ్యాంకు రూల్స్ చెబుతున్నా రైతును ఎందుకు వేధించారి చివాట్లు పెట్టి, బ్యాంకు మేనేజర్ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.