క.రా.క.రె.కు షాక్.. విడుదలకు హైకోర్టు బ్రేక్ - MicTv.in - Telugu News
mictv telugu

క.రా.క.రె.కు షాక్.. విడుదలకు హైకోర్టు బ్రేక్

November 28, 2019

High Court shocked the KRKR film .. Break to release.

రేపు విడుదలకు సిద్ధం అవుతున్న ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలుత నుంచీ వివాదాలను చుట్టుముట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వర్మ మాత్రం ఈ సినిమా మంచి సందేశాత్మక చిత్రం అంటున్నాడు. ఎవరినీ ఉద్దేశించి తీయలేదని, కల్పిత పాత్రలు ఉంటాయని అంటున్నాడు. అయితే ఈ సినిమా రెండు కులాల మధ్య చిచ్చు పెడుతున్నట్టు టైటిల్ ఉందని వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. 

కొంత మంది వ్యక్తులను కించపరిచేలా వర్మ తన సినిమాలో పాత్రలను చూపించారన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇదే విషయమై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే వర్మ మాత్రం తన సినిమా విడుదల పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. విడుదలకు కొన్ని గంటల ముందే హైకోర్టు వర్మకు షాక్ ఇచ్చింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. సోలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌ రావు సినిమాకు ఇంకా సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వలేవని కోర్టుకు తెలిపారు. సినిమా విషయంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్‌ బోర్డ్‌కు హైకోర్టు సూచించింది. వారం రోజుల్లో వివాదాలను పరిష్కరించి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 

రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్న సినిమా టైటిల్‌ను మార్చాలని చిత్రయూనిట్‌కు హైకోర్టు ఆదేశించింది. అయితే వర్మ ఇప్పటికే టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చామని కోర్టుకు తెలిపాడు. వీలైనంత త్వరగా సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ జారీ చేయాలని కోర్టును కోరాడు.