కోర్టులు ఒక్కో సారి అద్భుతమైన తీర్పులిస్తుంటవి. అంతే కాదు ప్రభుత్వాలకు కర్రు కాల్చి వాత పెడ్తుంటవి… దాని కంటే ఎక్వనే చేస్తవి. ఎవ్వరూ అడగక పోయినా ఇదిగో మేమేం లేమా ఏందీ అని జనం పక్షం తీసుకుంటవి. ఇట్లా జనాలకు మేలు చేసే… పాలకులకు పాఠాలు చెప్పే తీర్పునిచ్చింది ఉత్తరాఖండ్ హై కోర్టు. అట్లా ఇట్లా కాదు… పవర్ ను ఎంజాయ్ చేస్తూ విర్రవీగే టోళ్లకు చెంప చెళ్లు మనేటట్లు తీర్పు చెప్పింది.
ప్రభుత్వ బడుల్లో పిల్లలకు బేంచీలుండవు….. ఇర్గిపోయిన బ్లాక్ బోర్బులు… కూలి పోయిన గోడల నడ్మ పిల్లలు సద్వుకుంటుంటురు. కొన్ని చోట్ల నైతే ఇంకా చెట్ల కిందనే చద్వుకుంటున్నరు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లనే రూపు దిద్దుకుంటదని అంటరు కద…. తరగతి గదులే లేకుంటే… పిల్లలకు మినిమమ్ సౌలత్లే లేకుంటే ఇగ వాళ్లు ఎదగడం ఎట్లా…
అందుకే పెద్ద కోర్టు పెద్ద మనస్సు సర్కారు బడి పిల్లలకు బడుల్ల అన్నీ సౌకర్యాలు కల్పించేంత వరకు ప్రభుత్వం కార్లు, ఫోన్లు, ఎసీలు కొనేది లేదు. ఒక వేళ కొని ఎంజాయ్ చేయాలని అనుకుంటే పిల్లలకు బడుల్లో సౌకర్యాలు కల్పించాలని గట్టిగ చెప్పింది. ఆరు నెలలకో సారి బడులను అధికారులు సందర్శించాలని చెప్పింది. ప్రతి ఆరు నెలల కోసారి పిల్లలకు కొత్త యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పింది. మధ్యాహ్నం భోజనం పెట్టాలని అన్నది. ఇవేవీ చేయకుండా కార్లు, ఎసీలు, ఫోన్లు కొన్నారంటే సంగతి తేలుస్తానని తేల్చి చెప్పింది ఉత్తరాఖండ్ హై కోర్టు.