టీచర్ల బదిలీ ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బదిలీల్లో తమకు అన్యాయం జరుగుతోందని నాన్ స్పౌజ్ టీచర్లు పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన హైకోర్టు మార్చి 14 వరకు బదిలీలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌లో బదిలీ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, ఉద్యోగ దంపతులు, యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల్లో సవరణలకు అసెంబ్లీ ఆమోదం లేదని వాదించడంతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, నాలుగేళ్ల తర్వాత బదిలీ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం ఇందుకు రెండేళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుంది. దీంతో 317 జీవో ప్రకారం ఏడాది కింద ఇతర జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ అయిన టీచర్లు ఆందోళన చేపట్టారు.
నిబంధనల్లో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుత బదిలీకి అవకాశం కల్పించాలని కోరుతూ కొంతమంది టీచర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు వారి వాదనను పరిగణనలోకి తీసుకుంటూ మొత్తం 25 వేల మంది ఉన్నందున ఉమ్మడి జిల్లాలో చేసిన సర్వీసును కూడా కలిపి బదిలీ ప్రక్రియ చేపట్టాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిబంధనల్లో మార్పు చేసిన ప్రభుత్వం.. ట్రాన్స్‌ఫర్ కోసం వారికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో జనవరి 28న బదిలీ ప్రక్రియ మొదలవగా అప్పటికే 59 వేల మంది టీచర్లు అప్లై చేసుకున్నారు. కొత్తగా 25 వేల మంది రానుండడంతో ప్రక్రియ పూర్తి కావడానికి నెల రోజునల సమయం పడుతుందని అంచనా వేయగా, తాజాగా హైకోర్టు స్టే విధించడంతో మరింత సమయం పట్టే అవకాశముంది.