High tension on Chandrababu's Kuppam tour
mictv telugu

చంద్రబాబు కుప్పం టూర్‌పై హై టెన్షన్..

January 4, 2023

ఒక పక్క చంద్రబాబు పర్యటన..మరో పక్క రోడ్ షోలు, సభలపై వైసీపీ సర్కార్ ఆంక్షలతో ఏపీ రాజకీయం మళ్లీ వేడెక్కింది. నేడు చంద్రబాబు కుప్పం పర్యటనంపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభలో ఎనిమిది మంది, గుంటూరు జిల్లోని చంద్రన్న కానుక పంపిణీలో ముగ్గురు చనిపోవడంతో రోడ్లపై సభలు, ర్యాలీలపై రెండు రోజుల కిందట నిషేధం విధించింది. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సభలు, సమావేశాలకు కూడా మార్గదర్శకాలు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.

ఈ క్రమంలో నేటి నుంచి చంద్రబాబు కుప్పం పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇవాళ శాంతిపురం మండలంలో పర్యటిస్తారు. రేపు కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం అవుతారు. 6న గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. అయితే ఆంక్షలు ఉండడంతో చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ తాజా జీవోలు ప్రకారం రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్‌లకు అనుమతి లేదని డీఎస్పీ టీడీపీ నాయకులకు నోటీసులు అందజేశారు. అనుమతి ఉన్న చోటే సభలు, కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. రోడ్లు, జాతీయ, రాష్ట్ర రహదారులు, ఇరుకు సందుల్లో సభలు, రోడ్ షోలకు అనుమతి లేదని చెప్పారు.

టీడీపీ నాయకులు మాత్రం పోలీసుల హెచ్చరికలను భేఖాతరు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికే ఆంక్షలు విధించారని ఆరోపిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారమే చంద్రబాబు పర్యటన సాగుతుందని టీడీపీ చెబుతుండడంతో హై టెన్షన్ పరిస్థితి నెలకొంది. చంద్రబాబు టూర్ కొనసాగుతుందా లేదా పోలీసులు అడ్డుకుంటారా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.