Home > Featured > ఒక పోస్ట్… లక్షలు, కోట్ల ఆదాయం.

ఒక పోస్ట్… లక్షలు, కోట్ల ఆదాయం.

సోషల్ మీడియా….ఇప్పడు ఇదే ప్రపంచం అయిపోయింది చాలా మందికి. చుట్టూ ఉన్న జనాలతో మాట్లాడినా మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నారు. కొంతమందికి ఇది అడిక్షన్ అయితే మరికొంతమందికి సంపాదన అవుతోంది. సోషల్ మీడియాలో లక్షలు సంపాదించడం క్రేజ్ ఇప్పుడు. ఫాలోవర్స్ ను పెంచుకోవడం, క్రేజీగా పోస్టులు పెంచడం చేస్తే చాలు డబ్బులు వచ్చిపడుతున్నాయి. అలా లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వారిలో వీళ్ళు ముగ్గురు టాప్ లో ఉన్నారు.

కైలీ…సోషల్ మీడియాతో సంపాదిస్తున్న అమ్మాయిల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈమె ఒక పోస్ట్ కు తీసుకునే మొత్తం 15కోట్లు. చాలా చిన్న వయసులోనే బిలియనీర్ అయిపోయింది. పదేహేనేళ్ళకే మోడల్ అయిన కైలీ రియాల్టీ షోలు, సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇవి కాకుండా కైల్ పేరుతో క్లాత్, కాస్మొటిక్స్ బిజినెస్ కూడా చేస్తోంది.స్వశక్తితో ఎదిగిన పిన్న వయసు బిలియనీర్‌గా 2019-ఫోర్బ్స్‌లో, 2020లో స్వశక్తితో ఎదిగిన 100-శ్రీమంతుల జాబితాలో నిలిచింది. సంపాదించింది పంచడంలోనూ ముందుంది కైలీ.గ్రహణ మొర్రి, న్యూట్రిషన్‌ లోపం ఉన్న పిల్లలకు కోట్లరూపాయలు సాయం చేస్తోంది. 25 ఏళ్ల కైలీ ఖాతాను 37 కోట్లమంది అనుసరిస్తున్నారు.

సెలెనా గోమెజ్ పుట్టింది టెక్సాస్‌ లో. బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. గాయని కూడా. మొదట్లో బ్యాండ్‌తో కలిసి చేసినా తర్వాత సోలోగా పాటలు పాడుతూ ఎక్కువగా గుర్తింపు సంపాదించుకుంది. తన ఆల్బమ్స్‌ బిల్‌బోర్డ్‌ హాట్‌ 100 జాబితాలో తొలి పదిలోనే ఉండేవి. ఇన్‌స్టాలో 10కోట్ల ఫాలోయర్లను సంపాదించిన తొలి అమ్మాయి. పిల్లల్లో అనారోగ్యం, తాగునీరు, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 17 ఏళ్లకే యునిసెఫ్‌ అంబాసిడర్‌. ఎన్నో వ్యాపార సంస్థలకు ప్రచారకర్త. 30ఏళ్ల సెలెనా.. ‘సెలెనా గ్రేస్‌’ ‘రేర్‌ బ్యూటీ’ అనే లగ్జరీ గూడ్స్‌ సంస్థలనీ ప్రారంభించింది. ఇన్‌స్టాలో 34.8 కోట్ల ఫాలోయర్లున్న తను ఒక్కో పోస్టుకు రూ.14 కోట్లు తీసుకుంటుంది.

ఇక మన దేశానికి వస్తే…దేశీ ఇన్‌ఫ్లుయెన్సర్లలో సెలబ్రిటీ కాదు కానీ ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నది మాత్రం ఆష్నా ష్రాఫ్ . ఆష్నా చిన్నతనంలో ఎవరితోనూ కలిసేదికాదు. దాన్ని పోగొట్టాలని వాళ్లమ్మ మోడలింగ్‌ వైపు ప్రోత్సహించింది. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చదివిన తను 2013లో ఆన్‌లైన్‌ బ్యూటీ సంస్థ ‘ద స్నాబ్‌ షాప్‌’, ‘ద స్నాబ్‌ జర్నల్‌’ యూట్యూబ్‌ ఛానెల్‌లను ప్రారంభించింది. తన ఫ్యాషన్‌, మేకప్‌ చిట్కాలు యువతని ఆకట్టుకుంది. నైకా, మెబిలిన్‌, ఎస్‌టీ వంటి పెద్ద సంస్థలతో పనిచేసింది. ఆ తర్వాత ఇన్‌స్టాకు మారింది. పదిలక్షల పాలోవర్స్ ఉన్నఈమె పోస్ట్‌కు రూ.3 లక్షల వరకూ తీసుకుంటుంది. 29 ఏళ్ల ఆష్నా ఖాతా విలువ రూ.37 కోట్లు.

ఇన్ స్టాలో బాగా పాపులర్ అయిన మరో అమ్మాయి నిహారిక. సౌత్ ఇండియన్ అయిన ఈ అమ్మాయి తన కామెడీ పోస్ట్లతో బాగా పాపులర్ అయిపోయింది. దాదాపు 1.6 మిలియన్ మంది తనని ఫాలో అవుతున్నారు. తమిళ యాసతో తను చేసే పోస్ట్లు భలే ఉంటాయి. ఈ అమ్మాయి తన పోస్ట్ లతో ఎంత పాపులర్ అయిందంటే సినిమా ప్రమోషన్ల కోసం ఈ అమ్మాయిని పెట్టుకునేంతగా. ఈ మధ్య వచ్చిన అన్ని లాంగ్వేజ్ సినిమా ప్రమోషన్లను గనక మీరు గమనిస్తే ఈ అమ్మాయి కనిపిస్తుంది. మన మహేష్ బాబు, విజయ్ దేవరకొండ కూడా ఈమెతో తమ సినిమా ప్రమోషన్ చేయించుకున్నారు. ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఈమె సంపాదన కూడా లక్షల్లో ఉంటుంది.

వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఇలా సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. చాలా మంది యువత ఇప్పుడు దీన్నే కెరీర్ గా కూడా తీసుకుంటున్నారు. ఇక సినిమా యాక్టర్ల సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. సహజంగానే వాళ్ళకున్న ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో కూడా కోట్లు సంపాదిస్తున్నారు. ఇండియన్ యాక్టర్లలో అందరికన్నా ప్రియాంక చోప్రాకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Updated : 10 Nov 2022 11:44 PM GMT
Tags:    
Next Story
Share it
Top