హిజాబ్ గొడవ.. రాజీనామా చేసిన ముస్లిం లెక్చరర్ - MicTv.in - Telugu News
mictv telugu

హిజాబ్ గొడవ.. రాజీనామా చేసిన ముస్లిం లెక్చరర్

February 18, 2022

news02

ఎన్నో ఏళ్లుగా వేసుకుంటున్న హిజాబ్‌ను తొలగించి, పాఠాలు చెప్పాలని కాలేజీ యాజమాన్యం ఆదేశించడంతో మనోవేదనకు గురైన ఓ ముస్లిం ఉద్యోగిని తన ఉద్యోగానికే రాజీనామా చేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న చాందినీ అనే మహిళాను ఆ కాలేజీ యాజమాన్యం హిజాబ్‌ను తొలగించి, పాఠాలు బోధించమని ఆదేశించారు. దీంతో ఆమె ఉద్యోగాన్నే వదిలేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తుమకూరులోని జైన్ ప్రీ యూనివర్శిటీ కాలేజీలో చాందినీ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నారు. గత మూడేళ్లుగా కాలేజీలో హిజాబ్ ధరిస్తూ పనిచేశారు. ఇటీవల ఆ రాష్ట్రంలో హిజాబ్‌ వివాదం చెలరేగడంతో, తన హిజాబ్‌ను తీసివేయమని ఆ కళాశాల ప్రిన్సిపాల్ కోరారు. దాంతో చాందినీ ఫిబ్రవరి 16న ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఆమె ఓ రాజీనామా లేఖను పంపించారు.

“మీ కాలేజీలో నేను మూడేళ్లుగా హిజాబ్ ధరించే పాఠాలు బోధించాను. నా హిజాబ్‌ను తొలగించాలని మీరు నన్ను డిమాండ్ చేయడంతో, నేను నా ఇంగ్లీష్ లెక్చరర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. మతం హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, దానిని ఎవరూ కాదనలేరు. ధన్యవాదాలు. మీ అప్రజాస్వామిక చర్యని నేను ఖండిస్తున్నాను.” అని చాందినీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.