తమ కమ్యూనిటిని కించపరిచేలా YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిజ్రాలు ఆందోళన చేపట్టారు. తమకు క్షమాపణ చెప్పాలని..లేదంటే పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్, మహబూబాబాద్‌లో పలు చోట్ల ట్రాన్స్‌జెండర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమ కమ్యూనిటీని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని, తెలుగు రాష్ట్రాల్లోని హిజ్రాలకు షర్మిల బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల మహబూబాబాద్ లో పాదయాత్ర చేసిన షర్మిల స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ఉద్దేశిస్తూ..తమ ప్రస్తావన తేవడం హిజ్రాలను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో హిజ్రాలను కించపరుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ట్రాన్స్ జెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ‘మహబూబాబాద్ సభలో షర్మిల ట్రాన్స్ జెండర్లను కించపరిచేలా మాట్లాడారు. మేం చేతగాని వాళ్లమని మాట తప్పేవారమని..దేనికి పనికి రామని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని’ హిజ్రాలు చెప్పుకొచ్చారు.మా కమ్యూనిటీ గురించి షర్మిలకు ఏం తెలుసు..మా కమ్యూనిటీలోకి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. మా కమ్యూనిటీలో కూడా మేధావులు ఉన్నారు. గొప్ప గొప్ప చదువులు చదివి..డాక్టర్లు, లాయర్లు, పోలీసులు అయిన వాళ్లున్నారని అన్నారు.
మీ రాజకీయాలు మీకు ఉండొచ్చు కానీ మా కమ్యూనిటీ గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. “చరిత్ర తెలుసుకుంటే మంచింది. మీక్కావాలంటే ఒక్కరోజు మా కమ్యూనిటీలో బ్రతికి చూడండి. మా మంచితనం, మాట నిలబెట్టుకునే తనమేంటో మీకు తెలుస్తుంది. మా జీవన శైలి ఏంటి ? జీవన విధానం ఏంటి అనే విషయాలు తెలుసుకొని మాట్లాడాలి అంతే కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. షర్మిల మా ట్రాన్స్‌జెండర్ల కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పాలి.” అని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్ చేశారు.