యువతిపై లైంగిక దాడికి యత్నం.. కాపాడిన హిజ్రాలు - MicTv.in - Telugu News
mictv telugu

యువతిపై లైంగిక దాడికి యత్నం.. కాపాడిన హిజ్రాలు

July 5, 2022

దుండగుడి చేతిలో లైంగిక దాడికి గురికాబోతున్న యువతిని హిజ్రాలు కాపాడారు. నిందితుడిని స్థానికుల సహకారంతో పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మిజోరాం రాష్ట్రానికి చెందిన ఓ యువతి బెంగళూరులో ఒంటరిగా ఉంటూ నర్సింగ్ కోర్సు చదువుతోంది. యువతి నివాసానికి సమీపంలో హోటల్‌లో పనిచేసే మసురల్ షేక్ అనే వ్యక్తి ఆమెపై కన్నేసి రోజూ ఇబ్బంది పెట్టేవాడు. ఆమె తలుపు డోర్ కొట్టి పారిపోయేవాడు. యువతి తలుపు తీసి బయటికి వచ్చి చూడగా, ఎవరూ ఉండేవారు కాదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఈ క్రమంలో ఇటీవల నిందితుడు యువతి ఇంటి కాలింగ్ బెల్ నొక్కగా, యువతి తలుపు తెరిచింది. అయితే ఈ సారి భిన్నంగా ప్రవర్తించిన మసురల్.. ఆమెను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయాడు. అంతేకాక, ఆమెను పట్టుకొని బలవంతంగా లైంగిక దాడికి యత్నించాడు. ప్రమాదాన్ని గ్రహించిన యువతి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న ఇద్దరు హిజ్రాలు ఆ అరుపులు విని యువతి ఇంటికి వెళ్లి ఆమెను కాపాడారు. అంతలో స్థానికులు కూడా అక్కడికి చేరుకోవడంతో అందరూ కలిసి మసురల్‌ను చితకబాది కేఆర్ పురంలోని వివేక నగర్ పోలీసులకు దుండగుడిని అప్పగించారు. కాగా, సకాలంలో స్పందించి యువతి జీవితాన్ని కాపాడిన హిజ్రాలను స్థానికులతో పాటు పోలీసులు కూడా మెచ్చుకున్నారు.