ఆ రేపిస్టులను నేను ఉరితీస్తా.. రాష్ట్రపతికి లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ రేపిస్టులను నేను ఉరితీస్తా.. రాష్ట్రపతికి లేఖ

December 4, 2019

Nirbhaya Incident.

మహిళలను అత్యాచారం చేసి హత్యలు చేస్తున్న నిందితులను చంపడానికి మేమంటే మేము అంటున్నారు సామాన్య జనాలు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా ఫరవాలేదు అంటున్నారు. దుబాయ్ చట్టాల వుంటివి అమలు చేయాలని చెబుతున్నారు. ఓ తలారి కూడా నిర్భయ హంతకులను ఉరి తీయడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాడు. 2012లో డిసెంబర్‌ 16న దేశవ్యాప్తంగా ఢిల్లీ హత్యాచార ఘటన ‘నిర్భయ’ కేసు ఎంత కలకలం రేపిందో తెలిసిందే. ఈ ఘటనలో దోషులకు మరణ శిక్ష ఖాయం కాగా, ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారి లేకపోవడంతో జైలు అధికారులు టెన్షన్‌ పడుతున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌ షిమ్లాకు చెందిన రవి కుమార్‌ దేశాధ్యక్షుడు రామనాథ్‌ కోవింద్‌కు ఒక లేఖ రాశారు. ఢిల్లీ తీహార్ జైలులో ఎగ్జిక్యూటర్ లేనందున తనను  తాత్కాలిక తలారిగా నియమించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ అవకాశం ఇస్తే నిర్భయ కేసు దోషులను త్వరలో ఉరి తీయవచ్చు.  నిర్భయ ఆత్మ శాంతిస్తుందని ఆయన తెలిపారు. 

నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్‌కు మరణశిక్షను అమలు చేయనున్నారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని ‘బ్లాక్ వారెంట్’ జారీ చేసే అవకాశం ఉందని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడ తలారి లేకపోవడంతో ఇతర జైళ్లలో తలారీలు ఎవరైనా ఉన్నారా అని తీహార్ జైలు అధికారులు ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో పదవీ విరమణ చేసిన తలారీలు ఎవరైనా ఉన్నారా? అని వెతికే పనిలో ఉన్నారు. కాంట్రాక్టు పద్ధతిపై తలారీని నియమించాలని తీహార్ జైలు అధికారులు యోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

కాగా, 2012లో పారా మెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అయితే ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా మార్చారు. నేరస్థులలో ఒకడైన రాంసింగ్ తానున్న జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బాల నేరస్థుడు సంస్కరణ గృహంలో ఉన్నాడు. ఇక మిగిలిన నలుగురికి ఉరిశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. మరోవైపు క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించడంతో, తీహార్‌ జైలులో ఉన్న వినయ్‌ శర్మ రాష్ట్రపతిని ఆశ్రయించాడు. అయితే దోషులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష పెట్టవద్దని జాతీయ మహిళా కమిషన్‌ రాష్ట్రపతికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు.