పత్రికలు, టీవీ చానళ్లు.. ఎక్కడ చూసి ‘మీటూ’ చర్చనే. భయంతో, బయటపెడితే పరువు పోతుందన్న వేదనతో ఇన్నాళ్లూ కీచకపర్వాలను దాచిపెట్టిన బాధితులు ఆధారాలతో సహా కామాంధులు చేష్టలను బయటికి వెల్లడిస్తున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలకు నిద్రపట్టడం లేదు. మీటూ అంటూనే జడుసుకుంటున్నట్లు భోగట్టా.
ఈ గొడవ మధ్యలోకి తాజాగా ‘హిమ్ టూ’ ఉద్యమం కూడా వచ్చేసింది. హిమ్ టూ.. అంటే మగవారిపై అత్యాచారాలకు సంబంధించినది అని.. పొరపాటుపడేరు. విషయం లైంగిక వేధింపులకు సంబంధించిందే అయినా ఉద్దేశం మటుకు వేరు. ‘మా వాడు మంచి బాలుడు, ఆడోళ్లను కన్నెత్తి చూడడు..’ అని చెప్పుకునే బాపతు. ఓ అమెరికన్ మహిళ.. నేవీలో పనిచేస్తున్న తన ముద్దుల కొడుకు కేరక్టర్‌కు కితాబిస్తూ ఈమేరకు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆవిడ ట్వీట్ ఇలా సాగింది. ‘వీడు నా కొడుకు. గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాసులో పాసయ్యేడు. యూఎస్‌వో అవార్డు సాధించాడు. స్కూలు రోజుల నుంచే మంచి చదవరి. జెంటిల్‌మేన్.. ఆడోళ్లంటే విపరీతమైన గౌరవం. కానీ ప్రస్తుత పరిస్థితులకు భయపడి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నాడు. డేటింగ్ అన్నా, ఆడవాళ్లన్న భయపడుతున్నాడు. తనపై రాడికల్ ఫెమినిస్టులు ఎవరైనా అసత్యపు ఆరోపణలు(లైంగిక వేధింపుల) చేస్తారేమోనని భయపడుతున్నాడు. మీకు కూడా ఇలాంటి కొడుకు ఉన్నాడా? అయితే వాళ్లకే నా ఓటు’.. అని చెప్పి ‘హిమ్ టూ’ అని హ్యాష్‌ట్యాగ్ పెట్టి కొడుకు ఫొటో అంటించింది. దీంతో కొడుక్కు ఆమె మంచిమాటలతోనే చక్కగా చెక్ పెడుతోందని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఈ పోస్ట్ చూసి వందలాది తల్లుతు తమ కొడుకులకు సర్టిఫికెట్లు జారీ చేసి పడేస్తున్నారు. అయితే ఇది లైంగిక దాడులకు గురవుతున్న మహిళలను కించపరచడమేనని విమర్శలూ వస్తున్నాయి. కొందరైతే తమ పెంపుడు కుక్కుల ఫొటోలు పెట్టి ‘మై సన్.. హిమ్ టూ’ అని ఎద్దేవా చేస్తున్నారు. అనవసరంగా నన్ను ఎందుకీ రొంపిలోకి దింపావంటూ సదరు నేవీ యువకుడు తల్లిపై గయ్‌మని లేస్తున్నాడు.