హిండెన్‌బర్గ్.. మొన్నటివరకు మనదేశంలో ఎవరికీ తెలియని పేరు. షేర్ మార్కెట్, కార్పొరేట్ కంపెనీ వ్యవహారాల్లో మునిగి తేలేవారికి కూడా పెద్దగా పరిచయం లేని సంస్థ. అలాంటిది, ఇప్పుడు రోజూ దాని విశేషాలే. గౌతమ్ ఆదానీ సారథ్యంలోని ఆదానీ గ్రూప్ కంపెనీలు భారీగా అక్రమాలకు పాల్పడ్డాయని హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేయడంతో భారత షేర్ మార్కెట్‌లో భూకంపం బద్ధలైంది. లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. హిండెన్‌బర్గ్ తన నివేదికలో గట్టి ఆధారాలు ఇవ్వడమే దీనికి కారణమంటున్నాయి. ఈ తుపాను నేపథ్యంలో ఆదానీ పబ్లిక్ ఇష్యూ ఎఫ్‌పీఓ పూర్తి స్థాయిలో సబ్ స్క్రైబ్ కావడం గమనార్హం. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ గతంలో ఇచ్చిన నివేదికలు కూడా కాక రేపాయి. అది టార్గెట్ చేసిన కంపెనీల పునాదులు కదిలాయి. వాటిలో కొన్ని కంపెనీల గురించి తెలుసుకుందాం.
పెద్ద టార్గెట్లు..
అమెరికాకు చెందిన నికోలా కార్ప్ కంపెనీ ట్రక్కులు తయారు చేస్తుంటుంది. ఇది ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చింది. కోర్టు కూడా కంపెనీకి మొట్టికాయలు వేసింది. దీంతో ఒకప్పుడు 66 డాలర్లు పలికిన కంపెనీ షేర్ ధర ఇప్పుడు 2 డాలర్లకు పడిపోయింది. చైనాకు చెందిన ఫైనాన్స్ కంపెనీ విన్స్ ఫైనాన్స్ పరిస్థితీ ఇంతే. విన్స్ నష్టదాయకమైన లావాదేవీలను దాచిపెట్టిందని హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. 350 మిలియన్ డాలర్ల ఆస్తుల జప్తు వ్యవహారాన్ని బయటికి చెప్పలేదని, ఇదో దివాలా కంపెనీ అని పేర్కొంది. దీంతో కంపెనీని నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి తొలగించారు. అమెరికాకే చెందిన జీనియస్ కో ట్రేడింగ్ కంపెనీ రిటైల్ వ్యాపారంలో అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ తెలిపింది. దీంతో షేర్ ధర 6 డాలర్ల నుంచి 1.5 డాలర్లకు పతనమైంది. చైనా మెంటల్ రిసోర్సెస్ యుటిలైజేషన్, ప్రిడెక్టివ్ టెక్నాలజీ గ్రూప్, హెచ్ఎఫ్ ఫుడ్స్ కంపెనీలను కూడా హిండెన్‌బర్గ్ టార్గెట్ చేయగా వాటి షేర్లూ పతనమయ్యాయి. అదానీ షేర్లూ ఆ బాటలోనే కొనసాగుతున్నాయి.
హిండెన్‌బెర్గ్ ఆదాయం ఎలా..
అక్రమాలను వెలికితేసే హిండెన్‌బర్గ్ కూడా స్పెక్యులేషన్‌తోనే ఆదాయం పొందుతోంది. కంపెనీలను టార్గెట్ చేశాక పతనమయ్యే వాటి షేర్ల వ్యాపారంలో ఆదాయం సంపాదించుకుంటోంది. ఇది షార్ట్ సెల్లింగ్ సంస్థ. ఈ ప్రక్రియలో బ్రోకర్ల సాయంతో షేర్ల యజమానుల నుంచి షేర్లను అరువుకు తెచ్చుకుని ధరలు భారీగా పడతాయనే ఆశతో బెట్ పెట్టి అమ్ముతారు. ధరలు భారీగా పతనమయ్యాక వాటిని మళ్లీ తక్కువ ధరకు కొని అసలు యజమానికి అప్పజెప్పి లాభాలు తీసుకుంటారు. ఉదాహరణకు A అనే షార్ట్ సెల్లింగ్ కంపెనీ B నుంచి C అనే కంపెనీకి చెందిన రూ. 10 విలువైన షేరును అప్పు తీసుకుంటుంది. దాన్ని మార్కెట్లో రూ. 10కి అమ్ముతుంది. షేరు ధర పడిపోతుందనే అంచనాతో ఈ పనిచేస్తుంది. C కంపెనీ అక్రమాల వల్ల షేరు ధర రూ. 5కు పడిపోతే A దాన్ని రూ. 5 కొని Bకి అప్పగిస్తుంది. అంటే రూ. 5 లాభం వచ్చిందన్నమాట. వ్యూహాత్మక అంచనాలు, నిశితమైన అనుభవం, పార్టీల మధ్య ‘బెట్టింగ్’ నమ్మకం ఉంటే తప్ప ఇందులో లాభాలు రావడం సాధ్యం కాదు. ఇది పక్కా బెట్టింగ్. షార్ట్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు అమ్మేవాడు ధర తగ్గిపోతుందని బెట్ పెడతాడు. ధరలు పెరిగితే నష్టం భరిస్తాడు. స్టాక్ మార్కెట్లో తక్కువ వ్యవధిలో లాభాల కోసం దీన్ని షార్ట్ సెల్లింగ్ నడుపుతారు. ఇది సామాన్యులకే కాదు, స్టాక్స్ విషయంలో తలపండినవాళ్లూ తికమకపడే జూదం లాంటి వ్యవహారం.