ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ ఆదానికీ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆదానీ గ్రూపులోని పలు కంపెనీల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, చాలా కంపెనీలు అప్పుల కుప్పలని అమెరికాకు చెందిన హెండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపించింది. ఏళ్ల తరబడి వాటాల్లో, అకౌంటింగులో అవకతవకలు జరిగాయని తమ అధ్యయనంలో తేలినట్లు పేర్కొంది. ఈ విషయం బయటికి రాగానే మార్కెట్లో ఆదానీ కంపెనీల సంపద 46 వేల కోట్ల మేరకు హరించుకుపోయింది. షేర్ల విలువ 10 శాతం పడిపోయాయి.
నివేదికలో ఏముంది?
రెండేళ్లపాటు వేలకొద్ది పత్రాలను పరిశీలించి ఈ నివేదిక తయారుచేశామని హిండెన్‌బర్గ్ తెలిపింది. నివేదికలోని వివరాల ప్రకారం.. ఆదానీ కంపెనీల అసలు విలువలకు, మార్కెట్లో చూపే వాటి విలువకు చాలా తేడా ఉంది. ఆదానీ కంపెనీల నికర ఆస్తుల విలువ 120 బిలియన్ డాలర్లు కాగా ఇందులో 100 బిలియన్ డాలర్లు గత మూడేళ్లలో సంపాదించినవే. గ్రూపులో ఏడు లిస్టెడ్ కంపెనీలు 85 శాతం నష్టంలో ఉన్నాయి. మారిషస్, యూఏఈ, కరేబియన్ దీవుల వంటి పన్నుపోటులేని దేశాల్లో కంపెనీల ఏర్పాటుకు అక్రమదారుల్లో ప్రయత్నించారు. అక్రమంగా ఎగుమతులు, దిగుమతులు జరిపారు. ఆదానీ గ్రూపు గత ఎనిమిదేళ్లలో ఐదుగురు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లను మార్చడం అవకతవలకు సంకేతం.
అంతా అబద్ధం..
హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఆదానీ గ్రూప్ కొట్టిపడేసింది. ‘తప్పుడు సమాచారంతో బురదజల్లారు. ఆరుపణలకు ఎలాంటి ఆధారమూ లేదు’’ అని ఆదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేసిందర్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కంపెనీలన్నీ చట్టాల ప్రకారమే నడుచుకుంటున్నాయని, ఆదానీ గ్రూప్ పబ్లిక్ ఇష్యూలకు వెళ్తున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఈ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.