సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనం.. ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రకటనలతో కొత్త వొరవడికి తెరతీసిన మోదీ ప్రభుత్వం మరో కొత్త సంప్రదాయాన్ని కూడా ప్రారంభించనుంది. రేపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగాన్ని ఇంగ్లిష్లో కాకుండా హిందీలో వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్లె ప్రజలకు నేరుగా బడ్జెట్ కేటాయింపులు తెలియాలనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై విమర్శలు మొదలయ్యాయి. కేవలం ఉత్తరాదికే పరిమితమైన హిందీలో బడ్జెట్ ప్రసంగం చేయడం సరికాదని, దేశమంతా వాడుకలో ఉన్న ఇంగ్లిష్లో చేస్తే అందరికీ చేరువ అవుతుందని అంటున్నారు. హిందీ అధికార భాషేగాని, జాతీయ భాష కాదని గుర్తు చేస్తున్నారు. ఆ భాషను బలవంతంగా తమపై రుద్దడమేనని తమిళనాడు, కర్ణాటకల నేతలు మండిపడుతున్నారు. ఇతర భాషా రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే ఆరోపణకు జైట్లీ చర్య ఊతమిస్తుందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకుంటే మేలని దక్షిణాది బీజేపీ నేతలు కూడా సూచిస్తుండడం గమనార్హం.