హిందువుల పుణ్య క్షేత్రం శబరిమలలో మరో వివాదం మొదలైంది. నవంబర్ 16 నుంచి శబరిమల తీర్థయాత్ర ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ ఏడాది శబరిమల యాత్రపై ఆంక్షలు విధించింది. పంబ నదిలో స్నానం చేయడం, నెయ్యిని అభిషేకం చేయడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వీటిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయ్యప్ప మాల ధరించిన స్వాములు మాల విరమణకు శబరిమాలకు వచ్చినప్పుడు పంపా నదిలో స్నానం చేసి, నెయ్యి అభిషేకం చేయడం యాత్రలో అత్యంత కీలకమని హిందూ సంఘాలు చెబుతున్నాయి.
శబరిమల యాత్రలో ముఖ్యమైన, పవిత్రమైన అంశాలపై ఆంక్షలు విధించడం ఏంటని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఆంక్షలు పెట్టి ఆలయ పవిత్రతను మంటగలపకూడదని అంటున్నాయి. అవసరమైతే యాత్రను పూర్తిగా రద్దు చేయడం ఉత్తమమని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ఆంక్షలు ఎత్తివేయకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం విధించిన ఆంక్షలు భక్తుల్లో గందరగోళం సృష్టించే విధంగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.