‘మాంసాహారుల్ని శిక్షించడానికే దేవుడు కరోనా పంపాడు..’ - MicTv.in - Telugu News
mictv telugu

‘మాంసాహారుల్ని శిక్షించడానికే దేవుడు కరోనా పంపాడు..’

February 17, 2020

Hindu Mahasabha

‘మాంసాహారులను దండించడానికి దేవుడు ధరించిన కోప అవతారమే కరోనా వైరస్. మూగ జీవులను హింసించకూడదని, మనుషులను శాకాహారులుగా మార్చాలని చైనీయులకు గుణపాఠం చెప్పడానికే దేవుడు కరోనా అవతారం ఎత్తాడు’ అని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి వ్యాఖ్యానించారు. ఓ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా అంటే వైరస్ కాదు.. అది ఓ అవతారం. మూగ జీవులను రక్షించడానికి దేవుడు ఈ కోప అవతారం ఎత్తాడు. మాంసాహారులకు మృత్యుసందేశం ఇవ్వడానికి, శిక్షించడానికే కరోనా అవతరించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. కరోనా విగ్రహాన్ని ఏర్పాటు చేసి, క్షమాపణలు అడగాలి. అప్పుడే ఆ వైరస్ శాంతిస్తుంది’ అంటూ హిరణ్యకశివుడిని చంపడానికి వచ్చిన నృసింహ స్వామి అవతారాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ చైనీయులకు కొన్ని సూచనలు చేశారు. ‘భవిష్యత్తులో  మూగజీవులకు ఎప్పుడూ హాని చేయబోమని చైనీయులు ప్రతిజ్ఞ చేయాలి. వారు అలా చేసినప్పుడే కరోనా కోపం తగ్గి, దేవుడు శాంతి స్వరూపుడు అవుతాడు. మనదేశంలో ఆ వైరస్ రాదు ఎందుకంటే.. దేవుడిని ఆరాధించి, గోవులను రక్షించే మనకు కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని దేవుడు ఇచ్చాడు’ అని స్వామి చక్రపాణి తెలిపారు.  

కాగా, కరోనా జాతికి చెందిన కొవిడ్‌-19 వైరస్‌ చైనా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాల ప్రజలు కూడా భయపడుతున్న విషయం తెలిసిందే. అన్నీ దేశాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొందరు ఇలా కరోనాపై మాట్లాడుతున్నారు.