దుబాయ్‌లో భారీ హిందూ ఆలయం.. 16మంది దేవతలతో.. - MicTv.in - Telugu News
mictv telugu

దుబాయ్‌లో భారీ హిందూ ఆలయం.. 16మంది దేవతలతో..

October 4, 2022

పశ్చిమాసియాలో అరుదైన సంఘన చోటుచేసుకుంది. ఓ ఇస్లామిక్ దేశంలో భారీ హిందూ దేవాలయం ఈ రోజు ప్రారంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఏకంగా 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 16 మంది దేవతల మందిరాలతో నిర్మించిన ఈ గుడిలోకి దసరా సందర్భంగా బుధవారం నుంచి భక్తులను అనుమతించారు. ఇస్లామిక్ దేశాల్లో ఇటీవల కాలంలో ఇంత పెద్ద హైందవాలయాన్ని నిర్మించడం ఇదే తొలిసారి. ఇందులో 105 కంచుగంటలు ప్రత్యేక ఆకర్షణ.

యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ ఈ గుడి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. జెబెల్ అలీ ప్రాంతంలో వర్షిప్ విలేజ్ ఏరియాలో ఈ ఆలయాన్ని మూడేళ్ల శ్రమతో నిర్మించారు. ఇది స్వయంప్రతిపత్తి గల ఆలయం. సింధీ గురు దర్బార్ ఆలయ విస్తరణలో భాగంగా దీన్ని నెలకొల్పారు. శివుడు, కృష్ణుడు, వినాయకుడు, మహాలక్ష్మి గుళ్లతోపాటు పాటు సిక్కుల పరమ పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహిబ్ ఇందులో కొలువుదీరింది. ఇది దుబాయ్‌లో రెండో హిందూ ఆలయం. హిందూ వాస్తుతోపాటు అరబ్ జ్యామెట్రిక్ డిజైన్లను కూడా ఇందులో వాడారు.