ఆలయాన్ని నిలబెట్టిన ముస్లిం.. రాజకీయ నేతలకు గుణపాఠం - MicTv.in - Telugu News
mictv telugu

ఆలయాన్ని నిలబెట్టిన ముస్లిం.. రాజకీయ నేతలకు గుణపాఠం

February 20, 2018

దేశంలోని రాజకీయ నాయకులు ఒకపక్క మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు. తమమతం గొప్పదంటే తమ మతం గొప్పదని కొట్టుకుచస్తున్నారు. మరోపక్క.. ఇవేమీ పట్టని సామాన్య ప్రజలు మాత్రం కలసిమెలసి జీవిస్తున్నారు. ఒకరికొరు సాయం చేసుకుంటూ సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. గుజరాత్ లో కూలిపోయిన కాలగర్భంలో కలసిపోతున్న ఒక హిందూ ఆలయాని పరాయి మతస్తుడైన ముస్లిం పునర్నిర్మించాడు. మతం పేరుతో కాట్లాడుకుంటున్న ఉన్మాదులకు గుణపాఠం చెప్పాడు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 500 ఏళ్ల కిందట నిర్మించిన బీడ్ భంజన్ హనుమాన్‌ మందిర్‌ ఉంది. ఇందులో చాలా భాగం కూలిపోయింది. రేపోమాపో పూర్తిగా కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. అయినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో గుడికి వస్తున్నారు. అయితే ఎవరూ దాని బాగోగులకు ముందుకు రావడం లేదు. దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న మొయిన్ గులాం అనే ముస్లిం ముందుకొచ్చాడు. సొంత డబ్బుతో గుడిని పూర్తిస్థాయిలో పునర్నిర్మించాడు. కొందరు హిందువులు కూడా అతనికి సహకరించారు.  తాను చిన్నప్పటి నుంచి ఈ ఆలయాన్ని, అక్కడికి వచ్చే భక్తులను చూస్తూ ఉండేవాడినని, అలా అనుబంధం పెనవేసుకుందని గులాం చెప్పాడు.