కెనడా కేబినెట్‌లో తొలిసారి హిందూ మహిళకు చోటు - MicTv.in - Telugu News
mictv telugu

కెనడా కేబినెట్‌లో తొలిసారి హిందూ మహిళకు చోటు

November 21, 2019

Hindu Women .

కెనడా ప్రధాని తన మంత్రి వర్గ విస్తరణలో తొలిసారి భారత సంతతికి చెందిన హిందూ మహిళలకు తన కేబినెట్‌లో చోటు కల్పించారు. అనితా ఇందిరా ఆనంద్ అనే మహిళకు ఈ అవకాశం దక్కింది. అంటారియోలోని ఓక్ విల్లె స్వారీ నుంచి అనిత విజయం సాధించారు. అక్కడి పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి హిందూ మహిళ కావడంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కెనడా  కేబినెట్‌లో హిందూ మహిళల ప్రతినిథ్యంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన ముగ్గురు మంత్రులు ఉన్నారు. కానీ వారు ముగ్గురు సిక్కులు కావడంతో అనితా ఆనంద్ తొలి హిందూ మహిళగా రికార్డు సాధించారు. ప్రధాని జస్టిన్ ట్రూడో ఆమెకు ప్రజా సేవల శాఖను కేటాయించారు. టొరంటో విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. ఎయిర్‌ ఇండియా విమానం 182 మీద ఉగ్రవాద దాడిపై కూడా ఆమె పరిశోధన చేశారు. తన సేవలకు మెచ్చి ఆ దేశ ప్రధాని ఈ అవకాశం కల్పించారు.

అనితా ఇందిరా ఆనంద్ తల్లి సరోజ్ రామ్ పంజాబ్‌ వాసి కాగా ఆమె తండ్రి తమిళనాడుకు చెందిన ఎస్.వి ఆనంద్. వీరిద్దరూ వృత్తిరిత్యా వైద్యులు కావడంతో కెనడాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం నలుగురు పిల్లలకు తల్లిగా ఉన్న ఆనంద్ ఓక్విల్లే ప్రాంతంలోని ప్రజలకు సన్నిహితంగా మెలగడంతో అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తనకు వచ్చిన అవకాశంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 

కాగా 2015 లో ప్రధాని జస్టిన్ ట్రూడో మొదటిసారి కేబినెట్ ఏర్పాటు చేశారు. తాజాగా మరోసారి మంత్రివర్గ విస్తర్ణ చేపట్టారు. ఇప్పుడు కెనడా ప్రధాని మంత్రి వర్గంలో సగం మంది మహిళలు ఉండటం విశేషం. మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన దేశ ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి బలమైన, విభిన్నమైన, అనుభవజ్ఞులైన బృందంతో మంత్రి వర్గం ఏర్పాటు చేశానంటూ పేర్కొన్నారు.