‘నన్ను ఇలాగే వదిలేయండి.. లేదంటే పాత మాధవ్‌ను చూస్తారు’ - MicTv.in - Telugu News
mictv telugu

‘నన్ను ఇలాగే వదిలేయండి.. లేదంటే పాత మాధవ్‌ను చూస్తారు’

August 15, 2022

తనపై తప్పుడు ప్రచారం చేస్తే పాత గోరంట్ల మాధవ్ ను చూడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌. ఫేక్ వీడియోను తన వీడియోగా చూపించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని స్పష్టం చేశారు. తనపై ప్రచారంలో ఉన్న వీడియోను అమెరికా ల్యాబ్ కు పంపిన టీడీపీ నేతలు, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాటలను కూడా అమెరికా ల్యాబ్‌కు ఎందుకు పంపరని ప్రశ్నించారు.

నిన్న హైదరాబాద్‌ నుంచి అనంతపురం బయలుదేరిన ఎంపీ మాధవ్‌కు కర్నూలు సరిహద్దు టోల్‌గేట్‌ వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ, కొన్ని మీడియా సంస్థలు తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాయన్నారు. వీడియోలు నిజమైనవా? కాదా? అని తేల్చేందుకు పోలీసు వ్యవస్థ ఉందన్న ఆయన.. ఆ పనిని పోలీసులకు వదిలేయాలన్నారు.
పోలీసులు సహకరించడం వల్లే తాను తప్పించుకుంటున్నానన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థ తానొక్కడి కోసమే ఏర్పడలేదని, పోలీసు వ్యవస్థ బ్రిటీష్ కాలం నుంచే ఉందని అన్నారు. వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారని, మీడియా పోలీసు డ్యూటీ చేయడం మానుకోవాలని హితవు పలికారు. పోలీసులు తమ విధులు నిర్వర్తించుకునే విధంగా మీడియా మసలుకోవాలని అన్నారు. తనపై ప్రచారం చేస్తే పాత మాధవ్‌ను చూస్తారంటూ ఆయన శైలిలో హెచ్చరించారు.