హిందువులకు కశ్మీర్ సర్కారు షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

హిందువులకు కశ్మీర్ సర్కారు షాక్

December 12, 2017

మన దేశంలో హిందువులు మెజారీటీలన్న సంగతి తెలిసిందే. అయితే జమ్మూకశ్మీర్‌లో మాత్రం వీరు మైనారిటీలు. సిక్కులు కూడా మైనారిటీలే.  అల్పసంఖ్యాకులైన వీరి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి. దేశంలోని మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల్లో అక్కడి సర్కార్లు ఇలా చేస్తున్నాయి. అయితే తమ రాష్ట్రంలో అలాంటివేమీ వుండబోమని కశ్మీర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది.కశ్మీర్లో హిందువులకు, సిక్కులకు మైనారిటీ హోదా కింద అందాల్సిన వేల కోట్ల రూపాయిలను మెజారిటీలైన ముస్లింలకు అడ్డదారిని అందిస్తున్నారని అంకుశ్ శర్మ్ అనే లాయర్ కోర్టులో పిటిషన్ వేశాడు. రాష్ట్రంలో హిందూ మైనారిటీల కోసం కమిషన్ ఏర్పాటు చేస్తే నిధులు దారి మళ్లవని ఆయన పేర్కొన్నారు. కమిషన్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై కశ్మీర్‌లో సాగుతున్న  మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ-బీజేపీల సంకీర్ణ సర్కారు స్పందించింది.

నేషనల్ కమీషన్ ఫర్ మైనారిటీస్ చట్టం1952కు తమ రాష్ట్రం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతగా అవసరమైతే.. భవిష్యత్తులో మరెప్పుడైనా ఆలోచిస్తామని చెప్పుకొచ్చింది. కశ్మీర్లో 68 శాతం మంది ముస్లింలు, 28.4 శాతం మంది హిందువులు, 2 శాతం మంది సిక్కలు ఉన్నారు.