మత సామరస్యానికి ప్రతీక.. హిందువులే మసీదు నిర్వాహకులు
విభిన్న మతాలు, కులాలకు భారత దేశం ప్రతిక. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేక మతాల వారు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ.. ఆలయాలను, ప్రార్థనా మందిరాలను సందర్శిస్తూ అన్నదమ్ములా జీవిస్తారు. ఇంతటి ఘన చరిత్రకు బిహార్‌లోని ‘మారి’ గ్రామం సజీవ సాక్ష్యంగా ఉంది. హిందూ మతస్థులే అక్కడి మసీదును శుభ్రం చేస్తూ, నిత్యం ప్రార్థనలు జరిగేలా చూస్తున్నారు.
‘మారి’ గ్రామంలో ఒకప్పుడు హిందువులు, ముస్లింలు అంతా కలిసి నివసించేవారు. దశాబ్ధాల క్రితమే అక్కడ దేవాలయాలు, మసీదులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ కాలక్రమేనా.. ఉపాధి వెతుక్కుంటూ గ్రామం నుంచి చాలా మంది పట్టణాలకు వలస వెళ్లారు. దీంతో ముస్లిం కుటుంబం ఒక్కటి కూడా ఇప్పుడు ఆ గ్రామంలో లేదు. ఏళ్లనాటి చరిత్ర కలిగిన మసీదును అలాగే వదిలేయడం ఇష్టం లేని గ్రామస్థుతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హిందువులే మసీదును శుభ్రం చేస్తూ ఉన్నారు. నమాజు సమయాల్లో మైక్ ద్వారా ప్రార్థనను ప్లే చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే గ్రామంలోకి కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన వారు ఈ మసీదును దర్శించుకున్నాకే వారి ఇంట్లో అడుగుపెడతారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన మారి గ్రామస్థులను పలువురు ప్రశంసిస్తున్నారు.