Hindus take over Valmiki Temple in lahore
mictv telugu

పాకిస్తాన్ : 1200 ఏళ్ల నాటి వాల్మీకి ఆలయం.. క్రైస్తవుల నుంచి విముక్తి

August 4, 2022

ఇస్లాం దేశమైన పాకిస్తాన్‌లో 1200 ఏళ్ల నాటి వాల్మీకి దేవాలయం సుదీర్ఘ పోరాటం తర్వాత హిందువులకు దక్కింది. దాదాపు 22 ఏళ్లు క్రైస్తవ కుటుంబం ఆధీనంలో ఉన్న ఈ ఆలయాన్ని కోర్టు తీర్పు ద్వారా హిందువులు సాధించుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. లాహోర్ నగరంలోని ప్రఖ్యాత అనార్కలి బజార్ సమీపంలో ఈ ఆలయం ఉంది. 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం 22 ఏళ్లుగా ఓ క్రైస్తవ కుటుంబం ఆధీనంలో ఉండేది. తర్వాత వారు హిందూమతంలోకి మారగా, కేవలం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే గత రెండు దశాబ్దాలుగా ఆలయంలోకి అనుమతించేవారు.

దీంతో ఆలయం కోసం 2010 – 2011 లో మైనారిటీ ప్రార్ధనా స్థలాలను పర్యవేక్షించే ఫెడరల్ బాడీ ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ కోర్టులో కేసు వేసింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కోర్టు ఆలయ పర్యవేక్షణ, నిర్వహణను ఈ బోర్డుకు అప్పజెప్పింది. దీంతో క్రైస్తవ కుటుంబాన్ని అక్కడ నుంచి వెళ్లగొట్టి ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆలయాన్ని పునరుద్ధరించి పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని బోర్టు ప్రకటించింది. వందమందికి పైగా హిందువులు, సిక్కులు, క్రైస్తవ నేతలు ఆలయం వద్ద సమావేవమయ్యారని, హిందువులు తమ మతపరమైన ఆచారాలను ఆలయంలో నిర్వహించారని బోర్డు ప్రతినిధి తెలిపారు. కాగా, లాహోర్‌లో ప్రస్తుతం క‌ృష్ణుడి ఆలయంతో పాటు వాల్మీకి ఆలయం కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చింది.