విమానం తోకపై హనుమంతుడి స్టిక్కర్ అంటించిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) దాన్ని వెంటనే తీసేసింది. బొమ్మను అతికించడం ఎందుకు, తీసేయడం ఎందుకు అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బెంగళూరులో జరుగుతున్న ఏరో షో 2023 కోసం హెచ్ఏఎల్ తను తయారు చేసిన HLFT-42 సూపర్ సానిక్ విమానం తోకపై హనుమాన్ బొమ్మను అతికించింది.
విమానానికి వాయుదేవుడి కుమారుడైన హనుమతుడి పేరు బావుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు విన్యాసాల్లో పాల్గొంటున్న వాయసేన కెప్టెన్ హెచ్‌వీ థాకూర్ తెలిపారు. తర్వాత ఏమైందో ఏమో మర్నాడే బొమ్మను తీసేశారు. ‘‘అంతర్గత చర్చలు జరిపాం. ఆంజనేయుడి బొమ్మను అలా ప్రదర్శించడం తప్పుగా భావించి తీసేశాం,’’ అని హెచ్ఏఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సీబీ అనంతకృష్ణన్ చెప్పారు. హనుమాన్ బొమ్మతో మతపరమైన విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. HLFT-42 విమానాలను శిక్షణ కోసం వాడతున్నారు. తొలి స్వదేశీ విమానమైన మారుత్ కు కొత్త హంగులు జోడించి HLFT-42ను రూపొందించారు.